మరోసారి షిగెల్లా కలకలం.. కోజికోడ్‌లో తొలి కేసు
Shigella infection reported again in Kozhikode.మరోసారి కేరళలో షిగెల్లా కలకలం సృష్టించింది. కోజికోడ్‌లోని
By తోట వంశీ కుమార్ Published on 29 April 2022 9:09 AM ISTమరోసారి కేరళలో షిగెల్లా కలకలం సృష్టించింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో షిగెల్లా కేసు వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయన్నారు. మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. బాలిక పక్కింటిలో ఉండే ఉన్న మరో చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలున్నాయని, అయితే.. చిన్నారులిద్దరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు.
ఇక షిగెల్లా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నివారణ కోసం పరిసర ప్రాంతంలోని బావుల్లో క్లోరినేషన్ చేపట్టారు. జ్వరం, డయేరియా లక్షణాలున్న వారిపై వైద్యారోగ్యశాఖ సర్వే సైతం నిర్వహించింది. 2020లో కోజికోడ్‌లో షిగెల్లా కేసు నమోదైంది. ఓ ఏడాదిన్నర బాలుడులో ఈ వ్యాధి నిర్థారణ అయ్యింది.
షిగెల్లా అనే బ్యాక్టీరియా.. శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఒకరినుంచి మరొకరికి ఈ వ్యాధి సులభంగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రమైతే మరణం సంభవిస్తుంది. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైన షిగెల్లా సాధారణ లక్షణాలు. కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆర్ఎస్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు తీసుకోవాలని వైద్యులు సూచించారు.