మాజీ లోక్ సభ స్పీకర్ చనిపోయారంటూ కథనాలు.. బ్రతికే ఉన్నానంటున్న ఆమె
Shashi Tharoor apologizes for his wrong tweet on Sumitra Mahajan. సుమిత్రా మహాజన్ బ్రతికే ఉన్నప్పటికీ ఆమె చనిపోయారంటూ వార్తలు రావడం దారుణం.
By Medi Samrat Published on 23 April 2021 7:09 PM ISTలోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. దీంతో చాలా మంది ప్రముఖులు కూడా సుమిత్రా మహాజన్ చనిపోయారని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. సుమిత్రా మహాజన్ బ్రతికే ఉన్నప్పటికీ ఆమె చనిపోయారంటూ వార్తలు రావడం దారుణం. ఆమె మరణించినట్టు న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. చనిపోయానన్న విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండా ఈ వార్తలు, తొందర ఏంటని ప్రశ్నించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, వార్తలు అందించే చానెళ్లను ఇటువంటి వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని ప్రశ్నించారు.
తాను ఇంకా మరణించలేదని.. అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీస ధ్రువీకరణ లేకుండా వీళ్లిలా వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేయాలి.ఇండోర్ జిల్లా అధికారులనైనా అడిగి తెలుసుకోవచ్చు కదా..! కేంద్ర ప్రభుత్వం,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇవన్నీ గమనించాలని సుమిత్రా మహాజన్ చెప్పుకొచ్చారు. సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్ సైతం స్పందిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. తన తల్లిపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
సుమిత్రా మహాజన్ మరణించారనే వార్తలు చూసి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని ఉంచారు. ఈలోగా పలు టీవీ చానెళ్లు కూడా ఆమె మరణించినట్టు వార్తలను ప్రసారం చేశాయి. ఆమె క్షేమంగా వున్నారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో శశిథరూర్, తాను పెట్టిన ట్వీట్ ను తొలగించారు. విశ్వసనీయమైనదిగా భావించే ఓ సోర్స్ నుంచి నాకు ఆ సమాచారం వచ్చింది.ఏదేమైనా అది నిజం కాదని తెలిసి ఉపశమనం పొందానని శశిథరూర్ చెప్పుకొచ్చారు.