ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఘాజీపూర్ జిల్లాలోని రేవతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అథోలా గ్రామ సమీపంలోని గంగా నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బుధవారం మధ్యాహ్నాం ఈ ఘటన జరిగిందని ఘాజీపూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. పడవలో ఎక్కువ మంది వరద బాధితులు, కూలీలు ఉన్నట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్ఎఫ్) సహాయంతో 10 మందిని రక్షించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 17 మంది ప్రయాణీస్తున్నారన్నారు.
బుధవారం రోజే ఇద్దరు వృద్ధులు, నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీయగా గురువారం అర్థరాత్రి మరో మృతదేహాన్ని వెలికితీశారు. మృతులను సంధ్యాకుమార్(6), అనితా పాశ్వాన్(10), అలీసా యాదవ్(5), కుషాల్ యాదవ్(10), సత్యం (12), శివ శంకర్ అలియాస్ గ్వార్, నగీనా పాశ్వాన్ లుగా గుర్తించారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పడవ ప్రమాదంలో నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.