కేజ్రీవాల్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఆప్ ఎమ్మెల్యే

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీమాపురి ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు.

By Medi Samrat  Published on  6 Sept 2024 3:49 PM IST
కేజ్రీవాల్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఆప్ ఎమ్మెల్యే

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీమాపురి ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆయ‌న‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఆ త‌ర్వాత చాలా కాలం వేచిచూసిన ఆయ‌న‌ ఈ రోజు ఆయ‌న‌ కాంగ్రెస్‌లో చేరారు. రాజేంద్ర పాల్ పార్టీని వీడ‌టం అరవింద్ కేజ్రీవాల్ వ‌ర్గానికి పెద్ద దెబ్బగా విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ముందు మ‌రో ద‌ళిత నేత రాజ్‌కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మ‌రో ఆరు నెలల‌లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని దళితులు, ముస్లిం వ‌ర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట‌నే ఉన్నాయి. ఈ వర్గాలపై ఆయనకున్న పట్టు కారణంగా,.. అరవింద్ కేజ్రీవాల్ 2014-15 నుండి ఢిల్లీ రాజకీయాల్లో అజేయంగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చిక్కుకోవడం, ఆరోగ్య, విద్యా శాఖల్లో కుంభకోణాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో దళితులపై అరవింద్ కేజ్రీవాల్ పట్టు సడలితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించవచ్చు.

రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఢిల్లీ దళిత నేత‌ల‌లో ముఖ్యులు. రాజేంద్ర పాల్ గౌతమ్‌కు సీమాపురితో సహా తూర్పు ఢిల్లీలో మంచి పేరుంది. రాజ్‌కుమార్ కూడా ప్రభావం చూప‌గ‌లిగే నేత‌. ఈ నేతలిద్దరూ పార్టీ మార‌డంతో కేజ్రీవాల్ ఓట్‌బ్యాంక్‌ను దెబ్బతీసే అవ‌కాశం ఉంది.

Next Story