కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మృతి

Separatist leader Syed Ali Shah Geelani dies in Srinagar.కశ్మీర్ వేర్పాటువాద నేత‌ సయ్యద్ అలీ షా గిలానీ మ‌ర‌ణించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2021 11:01 AM IST
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మృతి

కశ్మీర్ వేర్పాటువాద నేత‌ సయ్యద్ అలీ షా గిలానీ మ‌ర‌ణించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం రాత్రి ప‌దిన్న‌ర గంట‌ల స‌మ‌యంలో శ్రీన‌గ‌ర్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఆయ‌న వ‌య‌స్సు 92 సంవ‌త్స‌రాలు. కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థల కూటమి ''హురియత్ కాన్ఫెరెన్స్''ను స్థాపించిన వారిలో గిలానీ ఒకరు. ప్రస్తుతం ఈ కూటమి క్రియాశీలంగా లేదు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికారు. హురియ‌త్‌కు కూడా గుడ్‌బై చెప్పారు.

సొపోరాకు సమీపంలోని ఓ కుగ్రామంలో 1929 సెప్టెంబర్‌29న జన్మించారు.సొపోర్‌ నియోజకవర్గం నుంచి 1972, 77, 87లో ఎమ్మెల్యేగాను పోటీ చేసి గెలుపొందారు. గిలానీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

'గిలానీ మరణ వార్త నన్ను కలచివేసింది. మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అంటే నాకెంతో గౌరవం''అని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్‌చేశారు.

క‌శ్మీర్‌లో ఆంక్ష‌లు..

గిలానీ మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే క‌శ్మీర్ లోయ‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. మొబైల్ సేవ‌ల‌ను నిలిపివేశారు.

ఇదిలా ఉంటే.. గిలానీ మృతి ప‌ట్ల పాకిస్థాన్ స్పందించింది. ఈ రోజు అధికారిక సంతాప దినంగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. గిలానీ త‌న జీవితాన్ని ప్ర‌జ‌ల కోసం ధార‌పోశార‌న్నారు. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను వేదించిన‌ట్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. గిలానీ మృతికి నివాళిగా ఈరోజు పాకిస్థాన్ జెండాను అవ‌న‌తం చేయ‌నున్న‌ట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశాడు.

Next Story