సీమా హైదర్ కు బాలీవుడ్ ఛాన్స్ ఇస్తే బాగోదు

అక్రమంగా పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చి సచిన్ మీనా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సీమా హైదర్

By Medi Samrat  Published on  14 Aug 2023 8:45 PM IST
సీమా హైదర్ కు బాలీవుడ్ ఛాన్స్ ఇస్తే బాగోదు

అక్రమంగా పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చి సచిన్ మీనా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సీమా హైదర్ కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. జానీ ఫైర్‌ఫాక్స్ అనే బృందం ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సీమను కలిసింది. 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' పేరుతో తెరకెక్కించబోయే సినిమాలో ఓ పాత్ర కోసం దర్శకులు జయంత్ సిన్హా సీమను ఆడిషన్ తీసుకున్నారు. అయితే ఆమెకు బాలీవుడ్ సినిమాలో నటించే అర్హత లేదని అంటున్నారు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీకి చెందిన ఒక నాయకుడు. MNS జనరల్ సెక్రటరీ అమేయ ఖోప్కర్ చిత్ర దర్శకులు, నిర్మాతలను ఈ డ్రామాను ఆపండి అంటూ హెచ్చరించారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా సినిమాను తీస్తే మాత్రం MNS ద్వారా నిరసనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్‌లో పాకిస్తానీ జాతీయులకు స్థానం లేదని.. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ఈ సినిమా నిర్మాతలు సిగ్గు పడాలని అన్నారు.

ట్వీట్ లో “పాకిస్తానీయులకు భారత చలనచిత్ర పరిశ్రమలో స్థానం ఉండకూడదనే మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము. సీమా హైదర్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ మహిళ. ఆమె ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా వార్తలు వచ్చాయి. మన ఇండస్ట్రీలో కొందరు ఆమెను ఫేమ్ కోసం నటిని చేస్తున్నారు. ఈ దేశద్రోహ నిర్మాతలకు సిగ్గు అనిపించడం లేదా? అటువంటి వాటిని వెంటనే ఆపాలి.. లేకుంటే MNS తీసుకునే నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని బహిరంగంగా హెచ్చరిస్తున్నాం” అని అన్నారు. పాకిస్థాన్ లోని కరాచీ నుంచి సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది. నేపాల్‌లో సచిన్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఈ జంట గ్రేటర్ నోయిడాలోని రబ్‌పురా గ్రామానికి మారారు. PUBG గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. సచిన్ ను పెళ్లాడి తాను భారతీయురాలిగా మారిపోయానని సీమా హైదర్ అంటోంది.

Next Story