పహల్గామ్ విషాదం తర్వాత ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన ఫిర్యాదుపై లక్నో పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
గత వారం పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని చంపిన ఘటనపై దేశం మొత్తం బాధతో ఉండగా సింగర్ నేహా చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారుడు తెలిపారు. "ఈ పరిస్థితిలో, గాయని నేహా సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ హ్యాండిల్ @nehafolksinger ఉపయోగించి జాతీయ సమగ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేసే కొన్ని అభ్యంతరకరమైన పోస్ట్‌లను పెట్టింది. మతం ఆధారంగా ఒక సమాజాన్ని మరొక సమాజంపై రెచ్చగొట్టడానికి పదేపదే ప్రయత్నాలు చేసింది" అని ఫిర్యాదుదారుడు అభయ్ ప్రతాప్ సింగ్ అన్నారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద బహుళ అభియోగాలపై కేసు నమోదు చేశారు, వాటిలో మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించడం వంటివి ఉన్నాయి. ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.