దేశ వ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్..ఎలా చేస్తారంటే?

దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది

By Knakam Karthik
Published on : 6 May 2025 3:55 PM IST

National News, Civil Defence, Mock Drill, India-Pakistan tensions, National Disaster Management Authority

దేశ వ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్..ఎలా చేస్తారంటే?

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమయాల్లో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించి, వారిని సమాయత్తపరిచేందుకు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు ఈ కసరత్తు జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, మాక్ డ్రిల్ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈరోజు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ (డీజీలు), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) అధికారులు హాజరయ్యారు. అనంతరం, గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రేపు జరగబోయే మాక్ డ్రిల్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. అణు విద్యుత్ కేంద్రాలున్న ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్ భటా, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి ప్రాంతాలు కేటగిరీ-1 కిందకు వస్తాయి. ఇక కేటగిరీ-2 జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో కేటగిరీలో 45 జిల్లాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర జనసమర్థ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.

ఈ కసరత్తులో భాగంగా ప్రజలకు శిక్షణ, అవగాహన కల్పించడంపై హోంశాఖ సమీక్షలో ప్రధానంగా చర్చించారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందుల గురించి ప్రజలకు వివరించాలని సమావేశంలో సూచించారు.

Next Story