కలవరపెడుతున్న ఒమిక్రాన్.. ముంబైలో 144 సెక్షన్, క్రిస్మస్, న్యూ ఇయర్‌పై ఆంక్షలు
Section 144 imposed in Mumbai till New Year Eve .దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2021 1:38 PM ISTదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించారు. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు బయటపడగా.. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17 కేసులు, ఢిల్లీలో 10, కేరళలో ఐదు, గుజరాత్‌లో నాలుగు, కర్ణాటకలో మూడు, తెలంగాణలో రెండు, బెంగాల్, ఏపీ, చండీఘర్, తమిళనాడులో ఒక కేసు చొప్పున వెలుగుచూశాయి.
ముంబైలో 144 సెక్షన్..
మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్ 16 నుంచి 31 వరకు అక్కడ 144 సెక్షన్‌ను విధించారు. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. జనాలు ఎవరూ గుమిగూడొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు విజ్ఞఫ్తి చేశారు.
ఇక దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12,16,011కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 6,984 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కి చేరింది. నిన్న ఒక్క రోజే 343 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,76,478కి చేరింది. నిన్న7,974 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,41,54,879కి చేరింది. ప్రస్తుతం దేశంలో 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి.