మహమ్మారిపై పోరులో భాగంగా దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. అయితే తొలివిడత వ్యాక్సినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ క్రమంలోనే కేంద్రం రెండో విడతలో వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 1 వ తేదీ నుంచి దేశంలోని 60 ఏళ్ళకు పైబడిన వృద్దులకు వ్యాక్సినేషన్ అందించనున్నారు. అలాగే.. ఈ దశలో 45 ఏళ్ళు పైబడి, ఆరోగ్యసమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
రెండవ దశలో మొత్తం 27 కోట్ల మంది వృద్దులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై ప్రధాని మంత్రివర్గ సమావేశంలో వృద్దులకు వ్యాక్సినేషన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుంటే.. దేశంలో ఇప్పటి వరకు టీకా లబ్దిదారుల సంఖ్య కోటి దాటింది.
సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 1,14,24,094 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్ని తెలిపారు. ఇందులో 64,25,060 మంది తొలి డోసును, 11,15,542 మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 38,83,492 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా టీకా తొలి డోస్ వేయించుకున్నట్లు తెలిపారు.