అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు ముందు.. జ‌మ్ముక‌శ్మీర్‌లో గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు పేలుళ్లు

Second blast at bus stand in Udhampur city within 8 hours.జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జంట పేలుళ్లు క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sept 2022 12:01 PM IST
అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు ముందు.. జ‌మ్ముక‌శ్మీర్‌లో గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు పేలుళ్లు

జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జంట పేలుళ్లు క‌ల‌క‌లం సృష్టించాయి. డొమిక్ చౌక్ లోని ఓ పెట్రోల్ పంపు స‌మీపంలో పార్క్ చేసిన బ‌స్సులో బుధ‌వారం రాత్రి 10.30 స‌మ‌యంలో మొద‌టి పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కండ‌క్ట‌ర్ సునీల్‌సింగ్‌తో పాటు అత‌డి స్నేహితుడు విజ‌య్ కుమార్ కు గాయాలు అయ్యాయి. ఘ‌ట‌న స‌మ‌యంలో వీరిద్ద‌రు డ్రైవ‌ర్ క్యాబిన్ వ‌ద్ద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ బ‌స్సు ప్ర‌తి రోజు ఉద‌యంపూర్‌-రామ్‌ఘ‌ర్‌-బ‌సంత్‌ఘ‌ర్ మ‌ధ్య ప్ర‌యాణికుల‌ను చేర‌వేస్తుంది. కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రామ్‌ఘ‌ర్‌కు పంపేందుకు కొన్ని దుప్ప‌ట్ల‌ను బ‌స్సుపై లోడ్ చేశార‌ని, ఆ త‌రువాతే ఈ పేలుడు జ‌రిగిన‌ట్లు బాధితులు తెలిపారు.

8 గంట‌ల్లో రెండో పేలుడు..

తొలి పేలుడు సంభ‌వించిన 8 గంట‌ల్లోనే రెండో పేలుడు జ‌రిగింది. గురువారం ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో ఉధంపూర్ బ‌స్టాండ్‌లో నిలిపి ఉంచిన బ‌స్సులో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రూ గాయ‌ప‌డ‌లేదు. ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేప‌ట్టారు.

అక్టోబ‌ర్ మొద‌టి వారంలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌..

అక్టోబ‌ర్ మొద‌టి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జమ్ము క‌శ్మీర్‌కు వెళ్ల‌నున్నారు. త్రికూట్ హ‌ల్స్‌లోని మాతా వైష్ణోదేవీని ద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం రాజౌరి, బ‌రాముల్లాలో బ‌హిరంగ ర్యాలీలో ప్ర‌సంగించ‌డంతో పాటు అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు, భ‌ద్ర‌తా ద‌ళాలు అత్యంత అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

Next Story