అంబానీ ఇంటి వద్ద వాహనంలో పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు.. స్కార్పియో యజమాని ఆత్మహత్య

Scorpio car owner found dead. ముఖేష్ అంబానీ నివాసం వద్ద బాంబులతో కూడిన నిలిపి ఉంచిన వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ శుక్రవారం ఆత్మహత్య

By Medi Samrat
Published on : 6 March 2021 7:39 AM IST

Mukesh Ambani bomb scare

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వద్ద బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే బాంబులతో నిలిపి ఉంచిన వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థాణే సమీపంలోని కాలువలో తేలిన ఆయన మృతదేహాన్ని నౌపాడా పోలీసులు వెలికి తీశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైలోని ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద ఫిబ్రవరి 25న ఒక ఎస్‌యూవీ వాహనాన్ని తనిఖీ చేయగా, పేలుడు పదార్థాలైన జెలెటిన్‌ స్టిక్స్‌తో పాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఒక లేఖ సైతం లభ్యమైన విషయం తెలిసిందే.

ఇక మరోవైపు ఆ వాహనం గురించి పోలీసులు ఆరా తీయగా, దాని యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది దానిని వాడటం లేదని దర్యాప్తులో తేలింది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అయితే థాణే జిల్లాకు చెందిన మన్‌సుఖ్‌ ఫిబ్రవరి 17న ఓ పంక్షన్‌కు వెళ్తుండగా, కారు చెడిపోవడం వల్ల ఐరోలీ ములుండ్‌ బ్రిడ్జ్‌ సమీపంలో పార్క్‌ చేశారు. తర్వాత రోజు కారును తెచ్చుకునేందుకు అక్కడికి వెళ్లగా, కారు కనిపించలేదని, నాలుగు గంటల పాటు వెతికినా తర్వాత కారు పోయినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో యజమాని శుక్రవారం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.


Next Story