రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషుల విడుదలకు సుప్రీం ఆదేశం
SC orders release of all convicts in Rajiv Gandhi assassination case. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని తమిళనాడు ప్రభుత్వ సిఫారసు మేరకు
By అంజి Published on 11 Nov 2022 10:40 AM GMTరాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని తమిళనాడు ప్రభుత్వ సిఫారసు మేరకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయాలని మేలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో మిగిలిన దోషులు కూడా విడుదల కాబోతున్నారు. న్యాయమూర్తులు బిఆర్ గవాయి, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం దోషులను విడుదల చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పెరారివాలన్‌కు సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఈ కేసులో మిగిలిన దోషులందరికీ వర్తిస్తాయని, అలాగే ఈ కేసులో దోషులందరినీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిందని కోర్టు పేర్కొంది. దోషులు ఎస్. నళిని, ఆర్‌పి రవిచంద్రన్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జైలు నుంచి విడుదల చేయాలంటూ తాము చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ.. ఇద్దరూ 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, నాలుగు సంవత్సరాల క్రితం మొత్తం ఏడుగురు దోషులకు శిక్షను రద్దు చేయడాన్ని ఆమోదించినట్లు చెప్పారు.
నిందితులను విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు కూడా చెప్పింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎల్టీటీఈకి చెందిన ఒక మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ ను హత్య చేశారు. ఈ కేసులో నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరారివాలన్ తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు.