ఎమ్మెల్యేల అనర్హతపై డిసెంబర్ 31లోగా నిర్ణయం తీసుకోండి : సుప్రీం

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం ధ‌ర్మాస‌నం డిసెంబర్ 31 వరకూ గడువు ఇచ్చింది.

By Medi Samrat  Published on  30 Oct 2023 9:53 AM GMT
ఎమ్మెల్యేల అనర్హతపై డిసెంబర్ 31లోగా నిర్ణయం తీసుకోండి : సుప్రీం

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం ధ‌ర్మాస‌నం డిసెంబర్ 31 వరకూ గడువు ఇచ్చింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వాటిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించిన పిటిషన్‌పై డిసెంబర్ 31లోగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 31లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను కోరింది.

పార్టీ చీలిక తర్వాత ఓ వ‌ర్గం ఎమ్మెల్యేలపై మరో వ‌ర్గం అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ.. శివసేన ప్రత్యర్థి వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి అక్టోబర్ 17న సుప్రీంకోర్టు నార్వేకర్‌కు గడువు ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అనంతరం విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.

అక్టోబర్ 17న విచారణ సందర్భంగా.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. టైమ్‌టేబుల్‌తో మేము సంతృప్తి చెందలేదని పేర్కొంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అయ‌నకి మద్దతు ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసినందుకు గతంలో సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌ను తీవ్రంగా మందలించింది. స్పీకర్ సుప్రీం కోర్ట్ ఆదేశాలను తిరస్కరించవద్దని చెప్పింది.

Next Story