స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్‌క్యాష్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోపు ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
దరఖాస్తును తిరస్కరిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, మార్చి 12, మంగళవారం పని వేళలు ముగిసేలోపు సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ''2024 మార్చి 15న సాయంత్రం 5 గంటలలోపు సమాచారాన్ని ఈసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో సంకలనం చేసి, వివరాలను ప్రచురించాలి'' అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పద్రివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఫిబ్రవరి 15న రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌కు సంబంధించి కోర్టు కోరినప్పుడు సమాచారాన్ని వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశించిందని రాజ్యాంగ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.