సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి
SC Directs parties to publish criminal records of candidates within 48 hrs of selection.దేశంలో రాజకీయ వ్యవస్థను నేర
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2021 1:52 PM ISTదేశంలో రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా సుప్రీం కోర్టు నడుం బిగించింది. రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని తెలియజేసింది.
బిహార్ ఎన్నికలకు సంబంధించి గతంలోనూ ఈ తరహా తీర్చు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. సదరు అభ్యర్థే తమ ఎంపిక పూర్తయిన 48 గంటల్లోపు లేదంటే నామినేషన్ పత్రాలు వేసే తొలి తేదీకి రెండు వారాల ముందు తమపై ఉన్న క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలి. అయితే ఇప్పుడా ఆదేశాలకు మార్పులు చేస్తూ ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా ధర్మాసనం స్పష్టంచేసింది. పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాల్ని వివరించాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కోర్టు వెల్లడించింది.
తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను పాటించని పార్టీలపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ కోరింది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో ఈ విధమైన క్రిమినల్ ఉదంతాలు పెరిగిపోయాయి. 2004 లో 24 శాతం మంది ఎంపీలకు నేర చరిత్ర ఉండగా.. 2009 లో అది 30 శాతానికి, 2014 లో 34 శాతానికి, 2019 లో 43 శాతానికి పెరిగినట్టు జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు.