మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, అతని సహచరులకు సంబంధించిన స్థలాలలో దాడులు నిర్వహించి రూ. 2.85 కోట్ల నగదు, మొత్తం 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం తెలిపింది. సోమవారం జరిపిన దాడులలో వీరు మంత్రికి "ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించారు" అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. నగదు, నాణేలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకుండా, రహస్య ప్రదేశంలో ఉంచబడ్డాయని ఒక ప్రకటనలో తెలిపింది.
57 ఏళ్ల జైన్‌ను మే 30న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. జూన్ 9 వరకు ఈడీ కస్టడీలో ఉంచారు. సోమవారం ఢిల్లీలోని నగల వ్యాపారితో సహా దాదాపు 7 చోట్ల, మరికొన్ని ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయిన జైన్ పై.. హవాలా లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ చేపడుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సత్యేందర్ కుమార్ జైన్, పూనమ్ జైన్, అతని సహచరులు, అతనికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన ఇతర వ్యక్తుల స్థలాలలో ఏకకాలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.