తమిళనాడులో సంచలనం సృష్టించిన సాతాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020 లాక్‌డౌన్ సమయంలో మొబైల్ షాపు తెరిచారన్న సాకుతో వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ కస్టడీలో అమానుషంగా చిత్రహింసలు పెట్టి చంపిన 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును "అరుదైన వాటిలో అత్యంత అరుదైనది"గా అభివర్ణించిన న్యాయమూర్తి ముత్తుకుమార్, భవిష్యత్తులో ఇటువంటి అరాచకాలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు మరణశిక్షతో పాటు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 84.1 లక్షల భారీ జరిమానా విధించగా, మిగిలిన ఎనిమిది మంది పోలీసులను కూడా ఈ దారుణంలో సమాన బాధ్యులుగా తేల్చుతూ ఉరిశిక్ష ఖరారు చేశారు. పోలీసుల అధికార దుర్వినియోగానికి, కస్టడీ హింసకు వ్యతిరేకంగా వెలువడిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులకు నాలుగేళ్ల తర్వాత సరైన న్యాయం జరిగిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.