ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన శశికళ
Sasikala discharged from Bengaluru hospital. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ .
By Medi Samrat Published on 31 Jan 2021 9:12 AM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె కొన్ని రోజుల నుంచి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆమె శిక్షా కాలం ముగియడంతో ఇటీవలే విడుదలయ్యారు. దాదాపు 10 రోజుల నుంచి శశికళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు ఆసుపత్రి వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆమెకు ఇప్పుడు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు ఇప్పటికే తెలిపారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విడుదలవుతుండడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె నేరుగా పోయెస్ గార్డెన్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది.
శశికళ వచ్చినా కూడా పార్టీలో తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని కేబినెట్ మంత్రి డి. జయకుమార్ మరోమారు తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే కంచుకోట అని, దానిని ఎవరూ బద్దలుగొట్టలేరని అన్నారు. అలాగే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సారథ్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళకం (ఎఎంఎంకే) ను అన్నాడీఎంకేలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దినకరన్ సారథ్యంలోని 'నమదు ఎంజీఆర్' పత్రికలో అన్నాడీఎంకేని దుష్టుల నుంచి శశికళ కాపాడతారని, పార్టీపై తిరిగి పట్టుసాధిస్తారని వచ్చిన వ్యాసంపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శశికళ ఎంట్రీ తో తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరూ ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు.