పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్టీ కార్యకర్త మణ్‌దీప్ సింగ్‌తో కలిసి ఆమె ఏడు అడుగులు వేసింది. పటియాలలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగిన నరీందర్ కౌర్-మన్‌దీప్ ల వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ హాజరయ్యారు. ప్రస్తుతం వీరి వివాహనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంగ్రూర్ జిల్లా భరాజ్ గ్రామం నరీందర్ కౌర్ భరాజ్ స్వస్థలం. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చదివారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కౌర్ తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరిని ఆక్షించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాపై 36,430 ఓట్ల తేడాతో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పంజాబ్ రాష్ట్రంలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.
ఇక మన్‌దీప్ సింగ్ స్వస్థలం సంగ్రూర్ జిల్లా భవానీగఢ్ ప్రాంతంలోని లాఖేవాల్ గ్రామం. ఆయన గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇంఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే వీరి వివాహ బంధానికి దారి తీసింది.