సీఎం కోసం తెచ్చిన స‌మోసాలు ఎవ‌రు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..

ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది.

By Kalasani Durgapraveen  Published on  8 Nov 2024 5:56 AM GMT
సీఎం కోసం తెచ్చిన స‌మోసాలు ఎవ‌రు తిన్నారు.? సీఐడీ విచారణలో ఏం తేలిందంటే..

ముఖ్యమంత్రి సుఖ్ కోసం తీసుకొచ్చిన సమోసాలకు సంబంధించిన ఘటన వివాదానికి దారితీసింది. సీఐడీ కార్యక్రమానికి తీసుకొచ్చిన సమోసాలను అతిథులకు బదులు సిబ్బందికి వడ్డించిన వ్యవహారంలో సీఐడీ విచారణ పూర్తి చేసింది. సమన్వయ లోపం వల్లే ఇలా జరిగిందని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. ఇది పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది.. ఈ త‌ప్పు కారణంగా ముఖ్య అతిథులకు సమోసాలను పంపిణీ చేయలేద‌ని పేర్కొన్నారు.

డీఎస్పీ ర్యాంక్ అధికారి తన దర్యాప్తు నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు పంపారు. అక్టోబరు 21న సీఐడీ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సుఖువింద‌ర్ సింగ్‌ సుక్కు వెళ్లారు. ఆయనతో పాటు పలువురు వీఐపీ అతిథులు, ప్రముఖ అధికారులు హాజరయ్యారు.

హోటల్ నుంచి కొన్ని ఆహార పదార్థాలు తీసుకురావాలని ఓ ఐజీ ర్యాంక్ అధికారి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను కోరారు. ఫలహారాలు తీసుకురావాలని అసిస్టెంట్ ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌కు ఎస్‌ఐ సూచించారు. ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ హోటల్ నుంచి మూడు బాక్సులు తీసుకొచ్చి ఎస్‌ఐకి సమాచారం అందించారు. దీంతో లక్కర్ బజార్‌లోని హోటల్ రాడిసన్ బ్లూ నుంచి సమోసాలు, కేక్‌లతో కూడిన మూడు పెట్టెలను తీసుకొచ్చారు. మూడు పెట్టెల్లో ఉంచిన అల్పాహారాన్ని ముఖ్య అతిథులకు అందించాలా వద్దా అని విధుల్లో ఉన్న పర్యాటక శాఖ సిబ్బందిని ప్రశ్నించగా.. మెనూలో చేర్చలేదని చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలను అందజేసిన లేడీ ఇన్‌స్పెక్టర్.. ఏ సీనియర్ అధికారిని అడగకుండా ఫలహారాలు అందించే విభాగానికి పంపారు. వారు అతిథులకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలను భద్రతా సిబ్బందికి అందించారు.

అయితే.. ప్రభుత్వం అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని హిమాచల్ ప్రజలు ఆందోళనకు గురవుతుంటే సమోసాల విషయంలో ప్రభుత్వం ఆందోళన చెందుతుందని బీజేపీ ఎమ్మెల్యే, మీడియా విభాగం ఇంచార్జి రణధీర్ శర్మ మండిపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారితీసింది.

Next Story