క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు మ‌ళ్లీ బెదిరింపులు..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 12:05 PM IST
క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు మ‌ళ్లీ బెదిరింపులు..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మూలాల ప్రకారం. ముంబై పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్‌పై బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపులో సల్మాన్‌కు రెండు ఆప్ష‌న్స్ ఇచ్చారు. సజీవంగా ఉండటానికి క్షమాపణ చెప్పండి లేదా రూ. 5 కోట్లు ఇవ్వండి అని సందేశంలో పేర్కొన్నారు. వారం రోజుల్లో సల్మాన్‌కి ఇది రెండో బెదిరింపు కావ‌డం విశేషం.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి పేరుతో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి సందేశం పంపినట్లు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ బ్రతకాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలి. ఇలా చేయకుంటే చంపేస్తాం.. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉందని పేర్కొన్నారు.

మెసేజ్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత వారం అక్టోబర్ 30న ముంబై ట్రాఫిక్ కంట్రోల్ సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌ నుండి రూ.2 కోట్లు డిమాండ్ చేశారని.. దానిని చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని తర్వాత, ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.


Next Story