వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ
జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది.
By Knakam Karthik
వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ
జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలక సమావేశానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే, సహ కార్యవాహ్‌లు, జాతీయ కార్యనిర్వాహక సభ్యులు, సమన్వయకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ సర్వసంఘ చీఫ్ మోహన్ భాగవత్ హాజరుకానున్నారు. అదేవిధంగా బీజేపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ్, సేవా సమితి వంటి 32 అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్, నాయకులు సునీల్ బన్సల్, శివప్రకాశ్, సౌదాన్ సింగ్, వి. సతీష్ తదితరులు కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో అన్ని సంస్థలు తమ ఏడాది నివేదికలను సమర్పించనున్నాయి. అలాగే అమెరికా వాణిజ్య సుంకాలు వంటి ఆధునిక అంశాలపై చర్చ జరుగుతుంది.
ఇక ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సిద్ధతలపై కూడా సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. మరోవైపు ఆగస్టు 26 మరియు 28 తేదీలలో మోహన్ భాగవత్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. ఆగస్టు 28న ఆయనకు లిఖిత పద్ధతిలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఇదే తరహా కార్యక్రమం 2018 సెప్టెంబరులో కూడా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు.