'మా టాబ్లెట్లే రోగులకు ఇవ్వండి' అంటూ.. డాక్టర్లకు రూ.కోట్ల గిఫ్ట్స్‌.. సుప్రీంకోర్టు ఆగ్రహం

Rs.1000 crore gifts to doctors to prescribe Dolo 650, Supreme Court is serious. డోలో 650 మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీ.. తమ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేసేందుకు డాక్టర్లకు పెద్ద ఎత్తున

By అంజి  Published on  18 Aug 2022 1:16 PM GMT
మా టాబ్లెట్లే రోగులకు ఇవ్వండి అంటూ.. డాక్టర్లకు రూ.కోట్ల గిఫ్ట్స్‌.. సుప్రీంకోర్టు ఆగ్రహం

డోలో 650 మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీ.. తమ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేసేందుకు డాక్టర్లకు పెద్ద ఎత్తున ముడుపులు అందించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. రోగులకు మాత్రలు సిఫార్స్‌ చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ముడుపులు, గిఫ్ట్‌లు ఇవ్వకుండా నిరోధించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

'ఇది విడానికి ఏం బాగోలేదు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. కరోనా సోకినప్పుడు ఇదే టాబ్లెట్‌ వేసుకోవాలని నాకు కూడా డాక్టర్లు చెప్పారు' అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇక ఫార్మా కంపెనీలు నైతికంగా వ్యవహరించేలా చూడాలని పిటిషన్‌లో మెడికల్‌ అసోసియేషన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జీవన హక్కులో కూడా వైద్య హక్కు ఒక భాగమని, అయితే ప్రస్తుత ఫార్మా కంపెనీలు.. డాక్టర్లకు ముడుపులు అందించకుండా నిరోధించే చట్టం ఏదీ లేదని కోర్టుకు తెలిపింది.

ముడుపులు, గిఫ్ట్‌లు తీసుకుని ప్రజలకు మెడిసన్స్‌ ఇచ్చే ప్రక్రియ చాలా డేంజర్‌ అని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం.. 10 రోజుల్లో స్పందన తెలపాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. డోలో 650 టాబ్లెట్లను మైక్సో ల్యాబ్స్‌ అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి చాలా ఫార్మా కంపెనీలను అధిగమించింది.

Next Story