రూ.2 వేల నోట్లు వారికి మాత్రమే ఉపయోగపడ్డాయి: చిదంబరం
రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న కేంద్రం చర్యపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సోమవారం మాట్లాడుతూ
By అంజి Published on 22 May 2023 12:12 PM ISTరూ.2 వేల నోట్లు వారికి మాత్రమే ఉపయోగపడ్డాయి: చిదంబరం
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న కేంద్రం చర్యపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సోమవారం మాట్లాడుతూ.. రూ.2,000 డినామినేషన్ నోటు “నల్లధనాన్ని దాచుకునేవారికి తమ డబ్బును సులభంగా దాచుకోవడానికి మాత్రమే సహాయపడిందని” అన్నారు. ''రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి ఎటువంటి గుర్తింపు, ఫారమ్‌లు, రుజువు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. 'నల్లధనాన్ని వెలికి తీసేందుకే రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ చేస్తున్న ప్రచారం ధ్వంసమైంది'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘‘సాధారణ ప్రజల వద్ద రూ.2000 నోట్లు లేవు. 2016లో దీనిని ప్రవేశపెట్టిన వెంటనే వారు దానిని విస్మరించారు. రోజువారీ చిల్లర మార్పిడికి అవి పనికిరావు. అయితే రూ. 2,000 నోట్లను ఎవరు ఉంచుకున్నారు. వాటిని ఎందుకు ఉపయోగించారు? మీకు సమాధానం తెలుసు'' అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చిదంబరం విమర్శలు గుప్పించారు. ''రూ. 2,000 నోటు కేవలం నల్లధనాన్ని దాచుకునేవారు తమ డబ్బును సులభంగా దాచుకోవడానికి మాత్రమే సహాయపడింది. రూ. 2000 నోట్లను ఉంచుకున్న వారు తమ నోట్లను మార్చుకునేందుకు రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలుకుతున్నారు.
2 వేల రూపాయల కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవడం ద్వారా నల్లధనం వెలికితీయడానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. 2016లో రూ.2000 నోట్లను తీసుకురావడం ఒక మూర్ఖను చర్య, కనీసం 7 సంవత్సరాల తర్వాత ఈ మూర్ఖపు చర్యను ఉపసంహరించుకోవడం పట్ల తాను సంతోషిస్తున్నానని చిదంబరం పేర్కొన్నారు. రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 20న క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవాలనుకుంటే, ప్రజలు రిక్విజిషన్ ఫారమ్‌లను పూరించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. మే 19న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2,000 బ్యాంకు నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని కూడా తెలిపింది.