కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌ను అప్పట్లో గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అపహరించడం పెద్ద సంచలనం అయిన సంగతి తెలిసిందే..! ఆయన విడుదల కోసం పెద్ద తతంగమే నడిచింది. రాజ్ కుమార్ ను విడుదల చేయాలంటే చాలా డిమాండ్లను వీరప్పన్ కర్ణాటక ప్రభుత్వం ముందు ఉంచారు. పెద్ద ఎత్తున డబ్బును కూడా రాజ్ కుమార్ కోసం కర్ణాటక ప్రభుత్వం వీరప్పన్ కు ముట్టజెప్పింది. ఇది ఎంత అన్నది ఇప్పటి వరకూ ఓ క్లారిటీ లేదు. కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. తాజాగా సమాచార పాత్రికేయుడు శివ సుబ్రమణ్యన్ రాసిన పుస్తకంలో ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.
వీరప్పన్ జీవితంపై 'లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్' అనే పుస్తకాన్ని శివసుబ్రమణ్యన్ విడుదల చేశారు. రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పుస్తకంలో తెలిపారు. 2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించి సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. 108 రోజుల తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. రాజ్‌కుమార్ విడుదల కోసం మొదట డిమాండ్ చేసింది కోటి రూపాయలు.
క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ పోయింది. రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని డిమాండ్ పెట్టాడు. ఎస్‌ఎం కృష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రెండుసార్లు రూ.5 కోట్లు చొప్పున, తుది విడతగా రూ.5.22 కోట్ల నగదును పంపించారని పుస్తకంలో రాసుకొచ్చారు. దేశంలోని బిగ్గెస్ట్ కిడ్నాప్ లో ఇది కూడా ఒకటని చెబుతూ ఉంటారు. వీరప్పన్ ఒకానొక దశలో రజనీకాంత్ లాంటి స్టార్ ను కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్లు ఇంకొందరు తెలిపారు.