'ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు'.. పరమహంస ఆచార్య సంచలన కామెంట్స్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.
By అంజి Published on 5 Sep 2023 1:12 AM GMT'ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు'.. పరమహంస ఆచార్య సంచలన కామెంట్స్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున దాడి మొదలు పెట్టాయి. తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలపై అయోధ్యలోని జగద్గురు పరమహంస ఆచార్య తీవ్రంగా స్పందించారు. ఆయన తల నరికి తీసుకొచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డును ప్రకటించారు. ఆయన మరేదైనా మతంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఇప్పటికే హతమై ఉండేవాడన్నారు. కానీ, సనాతన ధర్మ ప్రజలు అహింసను నమ్ముతున్నారు కాబట్టి ఇంకా బతికి ఉన్నాడని వ్యాఖ్యానించారు. సోమవారం అయోధ్యలో పరంధాస్ ఆచార్య ఒక చేతిలో ఉదయనిధి పోస్టర్‌ను, మరో చేతిలో కత్తిని పట్టుకుని, డీఎంకే మంత్రిని సింబాలిక్ శిరచ్ఛేదం చేస్తున్న దృశ్యాన్ని చూపించే వీడియోను విడుదల చేశాడు.
పోస్టర్‌కు నిప్పు పెట్టడం కూడా కనిపించింది. డీఎంకే నాయకుడి తల నరికితే రూ.10 కోట్ల రివార్డును ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఉదయనిధి స్పందిస్తూ.."ఈరోజు ఒక స్వామి (సీయర్) నా తలపై రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించాడు. ఉదయనిధి తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పాడు. అతను నిజమైన సాధువా లేదా డూప్లికేటా? నీకు నా తల ఎందుకు అంత ఇష్టం? నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? నా జుట్టు దువ్వుకోవడానికి రూ. 10 కోట్లు ఎందుకు ప్రకటిస్తున్నావు? రూ. 10 దువ్వెన ఇస్తే నేనే చేస్తాను" అని వ్యాఖ్యానించారు. అయితే, సనాతన ధర్మంపై తాను చేసిన ప్రకటనపై డీఎంకే మంత్రి గట్టిగానే ఉన్నారు. తాను హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు.
“శనివారం జరిగిన కార్యక్రమంలో నేను మాట్లాడిన విషయంపై పదే పదే మాట్లాడతాను.. ఇంకా ఎక్కువ మాట్లాడతాను.. చాలా మందికి చికాకు కలిగించే అంశం గురించి మాట్లాడబోతున్నానని ఆ రోజే చెప్పాను, అదే జరిగింది" అని ఆయన విలేకరులతో అన్నారు. సనాతన ధర్మం అంటే అది శాశ్వతమని, దానిని మార్చలేమని ఆయన పేర్కొన్నారు. "మహిళలు ఇంటికే పరిమితమయ్యారు, కానీ వారు బయటకు వచ్చారు. మహిళలు విద్యను పొందలేరని వారు చెప్పారు, ద్రవిడమ్ (డిఎంకె సిద్ధాంతం) మాత్రమే వారికి విద్యను అందించింది. అల్పాహార పథకం (తమిళనాడులో) కూడా ఎక్కువ మంది పిల్లలకు అందుతోంది. ముఖ్యంగా బాలికలు విద్యను పొందేలా చూస్తున్నాం " అని ఉదయనిధి అన్నారు.