Vande Bharat: రైలులోని టాయ్‌లెట్‌లో దూరి లాక్ చేసుకున్న యువకుడు.. కొన్ని గంటల తర్వాత
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విచిత్ర సంఘటన జరిగింది. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ యువకుడు.. రైలులోని టాయ్‌లెట్‌లోకి
By అంజి Published on 26 Jun 2023 11:15 AM IST
Vande Bharat: రైలులోని టాయ్‌లెట్‌లో దూరి లాక్ చేసుకున్న యువకుడు.. కొన్ని గంటల తర్వాత
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విచిత్ర సంఘటన జరిగింది. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ యువకుడు.. రైలులోని టాయ్‌లెట్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకున్నాడు. గంటల కొద్దీ టాయ్‌లెట్‌లోనే ఉండిపోయాడు. బయటకు రమ్మని ఎంత చెప్పినా వినలేదు. చివరకు ఆర్పీఎఫ్ జవాన్లు టాయ్‌లెట్ తలుపులను బద్దలుగొట్టి.. అతడిని బయటకు తీసకొచ్చారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం నాడు కేరళలోని తిరువనంతపురం - కాసర్‌గోడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టికెట్ తీసుకోకుండా కాసర్‌గోడ్ రైల్వే స్టేషన్‌లో యువకుడు రైలు ఎక్కి టాయ్‌లెట్‌లోకి వెళ్లి లాక్ వేసుకుని, లోపలి నుంచి దానిని తాడుతో కట్టాడు. అతడు టాయ్‌లెట్‌లో దూరిన విషయం తెలిసిన టీటీఈ.. టాయ్‌లెట్ దగ్గరకు వెళ్లి అతడిని బయటకు రమ్మన్నాడు. అయితే అతను మాత్రం బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. కొన్ని గంటలపాటు అందులోనే ఉండిపోయాడు. దీంతో టీటీఈ ఈ విషయం గురించి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమాచారం ఇచ్చాడు. అప్పటికే రైలు దాదాపు 275 కి.మీ. ప్రయాణించి శోర్‌నూర్ స్టేషనుకు చేరింది.
అక్కడ రైలు ఎక్కిన ఆర్పీఎఫ్ జవాన్లు.. టాయ్‌లెట్ తలుపు విరగ్గొట్టి అతడ్ని బయటకు తీసుకొచ్చారు. అతడ్ని ముంబయికి చెందిన శరణ్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతని చర్యలకు సంబంధించిన పరిస్థితులకు సంబంధించి అధికారులు అతనిని విచారిస్తున్నారు. టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కిన వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా మరుగుదొడ్డి తలుపులు మూసివేసినట్లు వెల్లడైంది. అతడి మానసిక పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.