జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
ఢిల్లీ-జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 10:24 AM IST
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
ఢిల్లీ-జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయపడ్డ వారందరినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షార్‌కు చెందిన 30 మంది వేష్ణోదేవి ఆలయానికి మినీ బస్సులో బయల్దేరారు. ఒక కుటుంబానికి చెందిన వారు మొత్తం ఈ బస్సులో ఆలయానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వీరంతా ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా వద్ద ట్రక్కును ఢీకొట్టింది. మినీ బస్సు డ్రైవర్ తప్పు లేదని అంటున్నారు క్షతగాత్రులు. ట్రక్కు ముందు ఒక కారు వేగంగా వెళ్లిందనీ.. అయితే పెట్రోల్ బంక్ వద్ద కారు అకస్మాత్తుగా మలుపు తీసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాంతో.. కారు వెనకాలే వెళ్లిన ట్రక్కు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ట్రక్కు రోడ్డుపైనే ఉన్నఫలంగా ఆగిపోయింది. ఇక ట్రక్కు వెనకాలే వెళ్తున్న మినీ బస్సు బ్రేక్ వేసినా లాభం లేకపోయింది. అదుపుతప్పి వెనక నుంచి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దాంతో.. ప్రమాదం సంభవించింది.
ఇక ఈ రోడ్డు ప్రమాదంలో మినీ బస్సులో వెళ్తున్న ఏడుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. 20 మందికి గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.