మదర్సా ధ్వంసంతో చెలరేగిన ఘర్షణ.. కనిపిస్తే కాల్చివేతకు సీఎం ఆదేశం

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని మదర్సాను అధికారులు ధ్వంసం చేసిన తర్వాత , దుండగులు పోలీసు అధికారులపై రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పంటించడంతో ఘర్షణలు చెలరేగాయి

By అంజి  Published on  9 Feb 2024 1:21 AM GMT
Riots, madrasa, Shoot at sight order, internet shut,Uttarakhand, Haldwani

మదర్సా ధ్వంసంతో చెలరేగిన ఘర్షణ.. కనిపిస్తే కాల్చివేతకు సీఎం ఆదేశం 

గురువారం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని అక్రమంగా నిర్మించబడిందని చెప్పబడుతున్న మదర్సాను అధికారులు ధ్వంసం చేసిన తర్వాత , దుండగులు పోలీసు అధికారులపై రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పంటించడంతో ఘర్షణలు చెలరేగాయి, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హల్వానీలోని బంభుల్‌పురాలో షూట్-ఎట్-సైట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అల్లర్ల దృష్ట్యా కర్ఫ్యూ విధించారు. దీనికి తోడు, శుక్రవారం హల్ద్వానీలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. హల్ద్వానీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు బంబుల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసారు.

ప్రతీకారంగా సమీపంలో నివసిస్తున్న వ్యక్తుల సమూహం పోలీసు అధికారులపై రాళ్లు రువ్వడం ప్రారంభించింది, ఫలితంగా పలువురు అధికారులకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. అదనంగా, ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను తగులబెట్టడం వల్ల సమీపంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఒక గుంపు బంబుల్‌పురా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టడంతో పలువురు జర్నలిస్టులు, పరిపాలన అధికారులు పోలీస్ స్టేషన్‌లో చిక్కుకున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో అదనపు బలగాలను హల్ద్వానీకి రప్పించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో సమావేశం నిర్వహించిన తరువాత, బంబుల్‌పురాలో కర్ఫ్యూ విధించబడింది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

పరిస్థితి గురించి ధామి మాట్లాడుతూ, "హల్ద్వానీలోని బంబుల్‌పురా ప్రాంతంలో, కోర్టు ఆదేశాలను అనుసరించి పరిపాలనకు చెందిన ఒక బృందం ఆక్రమణ నిరోధక డ్రైవ్‌కు వెళ్లింది. అక్కడ సంఘ వ్యతిరేకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతమంది పోలీసు సిబ్బంది మరియు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు గాయపడ్డారు. పోలీసు మరియు కేంద్ర బలగాల అదనపు కంపెనీలను అక్కడికి పంపుతున్నాం. శాంతిభద్రతలను కాపాడాలని మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసాము. కర్ఫ్యూ అమలులో ఉంది. అల్లర్లు, దహనం చేసిన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి" అని చెప్పారు.

పారామిలటరీ బలగాలను రాష్ట్రానికి పంపడంతో ఇప్పుడు బంబుల్‌పురాలో పరిస్థితి మెరుగుపడిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, హల్ద్వానీలో ఇంటర్నెట్ షట్‌డౌన్ విధించబడింది. వీడియో రికార్డింగ్‌లతో సహా వివిధ ఆధారాల ద్వారా నిందితులను గుర్తిస్తామని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. అల్లర్లకు బాధ్యులైన వారి నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేస్తామని, మరింత సమాచారం సేకరించేందుకు అల్లర్లకు సంబంధించిన పోస్టర్లను ప్రచారం చేస్తామని తెలిపారు.

Next Story