భారీగా తగ్గిన చికెన్ ధరలు..!
Retail chicken prices dip after an avian flu outbreak. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. దీనితో భారీగా తగ్గిన చికెన్ ధరలు.
By Medi Samrat
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. యూపీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతుండడంతో ప్రజలు కోడి మాంసం తినడానికి భయపడుతూ ఉన్నారు. పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా నష్టాల బాట పడుతోంది. ప్రజల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. పలు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.60 రూపాయల కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్రలో కిలో చికెన్ ధర రూ.58, గుజరాత్‌లో రూ.65, తమిళనాడులో రూ. 70కి పడిపోయింది. తమిళనాడులోని నమక్కల్‌లో ఒక గుడ్డు ధర రూ.4.20కి చేరింది. హర్యానాలో రూ.4.05, పూణెలో రూ. 4.50గా ఉంది.
ఇప్పటికి 10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ పాకినట్టు కేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లోనూ ఫ్లూ కనిపించింది. ఇక రాష్ట్రాలు బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని కూడా అరికట్టాలని కేంద్రం సూచించింది. జలాశయాలు, పౌల్ట్రీ పరిశ్రమలు, జంతుప్రదర్శన శాలల వద్ద నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ బారినపడిన కోళ్లు, ఇతర పక్షుల సామూహిక వధకు అవసరమైన పీపీఈ కిట్లు, ఇతర ఉపకరణాలు సమకూర్చుకోవాలని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో కోళ్ల నమూనాలను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని తెలిసిందని అధికారులు ప్రకటించారు.