కోవిడ్ వైద్యానికి రెమ్‌డెసివిర్ అవసరం లేదంటున్నారు..!
Remdesivir being considered to be dropped from COVID-19 treatment soon. భారత వైద్య పరిశోధన మండలి ఇటీవలే కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్
By Medi Samrat Published on 19 May 2021 10:53 AM GMTభారత వైద్య పరిశోధన మండలి ఇటీవలే కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం ప్లాస్మా థెరపీ వాడొద్దని సూచించిన సంగతి తెలిసిందే..! ప్లాస్మా థెరపీ కోసం కరోనా నుంచి కోలుకున్న వారి దగ్గర ప్లాస్మా తీసుకుంటే వారు మరింత బలహీన పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని.. ముఖ్యంగా ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని భారత వైద్య పరిశోధన మండలి తేల్చింది. భారతదేశంలో ప్లాస్మా థెరపీని ట్రీట్‌మెంట్ లిస్టులోంచి తొలగించాలని కొత్తగా సూచించింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ విషయంలో కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
రెమ్‌డెసివిర్ మందులు అసలు దొరకడం లేదు. చాలా చోట్ల వీటిని బ్లాక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే..! కరోనా రోగులకు చాలా మంది డాక్టర్లు రెమ్‌డెసివిర్ రాసేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెమ్‌డెసివిర్ ప్రాణాలను కాపాడగలదు అనేందుకు ఆధారాలు లేవు అని చెప్పింది. కొవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు. కొవిడ్-19 చికిత్సలో బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని మంగళవారం తెలిపారు.
ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రానా మాట్లాడుతూ కరోనా ట్రీట్‌మెంట్ నుంచి రెమ్‌డెసివిర్‌ను కూడా తొలగించే అంశంపై పరిశీలన జరుగుతోందని అన్నారు. అది కరోనా పేషెంట్లను కాపాడగలదు అనేందుకు ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. వ్యాధిని నయం చేయవు అని తేలినప్పుడు వాటిని ఆ వ్యాధికి వాడకుండా రద్దు చేస్తారని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.