ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
By Srikanth Gundamalla Published on 4 April 2024 8:19 AM GMTఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు ఈడీ కస్టడీలో విచారణ తర్వాత ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. జైలులో ఉండే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. పలు ఆదేశాలను కూడా జారీ చేశారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిల్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన బెంచ్ కొట్టేసింది.
సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ అంశంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు బెంచ్ తెలిపింది. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం పనిచేయడం లేదని మేం ఎలా తేలుస్తామనీ.. ఎల్‌జీ ఇందుకు సరైన వ్యక్తి అని హైకోర్టు చెప్పింది. ఆయనకు మార్గదర్శకత్వం అవసరం లేదని హైకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో ఆయనే ఆలోచన చేస్తారని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు.
కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిల్ దాఖలు కావడం ఇది రెండోసారి. సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి గత నెల 28న దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.