పరీక్ష మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుంది అనగా విధ్యార్థులు తమకు అదనపు సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. అయితే.. నిర్ణీత సమయానికే పరీక్ష ఆఖరి గంట మోగింది. అంతే.. సహనం కోల్పోయిన విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మణిపూర్ రాష్ట్రాంలోని తాబౌల్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
మణిపూర్ రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం అయ్యాయి. శనివారం మణిపురి పేపర్ పరీక్ష జరిగింది. తౌబాల్ జిల్లా యైరిపోక్‌లోని ఏసీఎంఈ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 405 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో కొంత మంది పరీక్ష మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుంది అనగా.. పరీక్ష రాసేందుకు సమయం సరిపోలేదని అదనపు సమయం ఇవ్వాలని ఇన్విజిలేటర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఓ వైపు ఈ గొడవ జరుగుతుండగానే పరీక్ష ఆఖరి బెల్ మోగింది. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి పరీక్ష పేపర్లు తీసుకున్నారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు విద్యార్థులు పాఠశాలలోని బెంచీలు, కుర్చీలను విరగొట్టారు. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ గందగోళం కారణంగా ఓ మహిళా టీచర్‌తో పాటు 15 మంది విద్యార్థులు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధ్యులైన 8 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
మణిపూర్ బోర్డు 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 23 ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి.