ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటన తర్వాత రెండు చోట్లా వెంటనే దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. ఈ స్మారక చిహ్నాల ప్రాంగణంలో బాంబు ఉందంటూ ఉదయం 9:03 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని అధికారి తెలిపారు. వెంటనే భద్రతా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. "మేము సంఘటనా స్థలానికి అగ్నిమాపక టెండర్‌ను పంపాము. రెండు ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీ చేసాము. అయితే దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు" అని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఢిల్లీలో భద్రతా వ్యవస్థ సెన్సిటివ్‌గా ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోట, జామా మసీదు రెండూ ప్రధాన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలు. వీటిని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు సందర్శిస్తారు. బెదిరింపుల తర్వాత, పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు ఆ ప్రాంతంలో తమ నిఘాను పెంచాయి.
ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. ఈ కాల్‌ని ఎక్కడి నుంచి ఎవరు చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. ఇది వికృత చర్యగా పరిగణించబడుతుందని.. పుకార్లను పట్టించుకోవద్దని, శాంతి భద్రతలను కాపాడాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తప్పుడు బాంబు బెదిరింపుల ఘటనలు వెలుగు చూస్తున్నాయని, వీటి కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రెండు చోట్లా పరిస్థితి సాధారణంగానే ఉండడంతో పర్యాటకులకు ఎలాంటి ముప్పు లేదన్నారు.