ఆర్మీ నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి దిగిన సీబీఐ..!

Recruitment scam in Army. ఆర్మీ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో అవినీతికి పాల్పడిన 23 మందిపై కేసు నమోదైంది. వారిలో లెప్టినెంట్‌ కల్నల్స్‌, ఒక మేనేజర్‌ ఉన్నట్లు సమాచారం.

By Medi Samrat  Published on  16 March 2021 6:04 AM GMT
Recruitment scam in Army

దేశంలో అవినీతి ఏరులై పారుతోంది. అవినీతి అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా దేశ రక్షణ శాఖలో అవినీతి చోటు చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్మీ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో అవినీతికి పాల్పడిన 23 మందిపై కేసు నమోదైంది. వారిలో లెప్టినెంట్‌ కల్నల్స్‌, ఒక మేనేజర్‌ ఉన్నట్లు సమాచారం.

ఆర్మీ నియామకాల్లో అవకతవకలు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దేశ వ్యాప్తంగా 13 నగరాల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, విశాఖ, కైతల్‌, కపూర్తల, బతిండా, పల్వాల్‌, లఖ్‌నవూ, జైపూర్‌, గువాహటి, బరేలీ, గోరఖ్‌పూర్‌, జోర్హట్‌, చిరాంగన్‌లలోని బేస్‌ ఆస్పత్రి, కంటోన్మెంట్‌, ఇంత ఆర్మీ సముదాయాలు, పౌరుల నివాసాలు సహా 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో పలు పత్రాలను, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో 23 మందిపై కేసు నమోదైంది. అయితే ఇందులో ఆరుగురు లెప్టినెంట్‌ కర్నల్‌స్థాయి అధికారులు, ఒక మేనేజర్‌, 10 మంది సైనిక అధికారులు, ఆరుగురు ఇతర సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా జరిగిన జనరల్‌ డ్యూటీ పర్సనల్స్‌ ఎంపికలో పేపర్‌ ముందే బయటకు వచ్చినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో పూణేలో స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టింది. ఆ తర్వాత పరీక్షను రద్దు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూణేలో ముగ్గురిని అరెస్టు చేశారు. అలాగే ఆర్మీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసును సైన్యం సీబీఐకి బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని సీబీఐ, ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ రిక్రూట్మెంట్ రాకెట్ సూత్రధారిగా వ్యవహరించినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం స్టడీ సెలవుల్లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్, నాయిబ్ సుబేదార్ కూడా ఎస్‌ఎస్‌బీ కేంద్రాలలోని ముఖ్యమైన వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.




Next Story