భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రబలడానికి కారణం ఇదేనట..!
Reasons For Covid Cases Increasing. భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా పెరగడానికి కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూ ఉన్నారు
By Medi Samrat
భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంది. సెకండ్ వేవ్ సమయంలో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. మొన్న ఒక్క రోజులో 1,45,384 మందికి కరోనా సోకగా, కొత్తగా 1,52,879 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 90,584 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 839 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,69,275కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,20,81,443 మంది కోలుకున్నారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా పెరగడానికి కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనాలో కొత్త రకాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండడం వలనే కొత్త కేసులు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలు, బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం నెమ్మదిగా సాగడం వంటివి కూడా దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్ జమీల్, టి. జాకోబ్ జాన్‌లు మాట్లాడుతూ కరోనా వైరస్ మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజల్లో అలసత్వం పెరిగిందని .. కేంద్ర ప్రభుత్వమే తొలుత అలసత్వం ప్రదర్శించిందని, ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజల్లోనూ అది పెరిగిందని అన్నారు. సిబ్బంది మొత్తానికి టీకాలు ఇవ్వకుండానే పాఠశాలలు తెరిచారని.. మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. కొన్ని చోట్ల అవసరం లేనప్పటికీ టీకాలు వేయడం వల్ల చాలా టీకాలు వృథా అయ్యాయన్నారు.
మార్చి మొదటి నుంచే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఆరోగ్య కార్యకర్తలు, వృద్దులు టీకాలు తీసుకునేందుకు ముందుకు రాలేదని.. దేశంలో ఇప్పటివరకు 5 శాతం మంది మాత్రమే తొలి విడత టీకా డోసు తీసుకున్నారని, 0.7 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారిని లైట్ గా తీసుకుంటే చాలా కష్టమని.. ఇంకొద్ది రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతూ ఉన్నారు. ప్రజల్లో అలసత్వం అన్నది పెరిగిపోతోందని.. ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.