'గంజాయిని ఎలుకలు తినేశాయి'.. కోర్టులో పోలీసుల వింత వాదన
ఎలుకలు గంజాయి తినేశాయంట.. కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 22 కిలోల గంజాయిని ఎలుకలు స్వాహా చేశాయట. ఈ విషయాన్ని చెప్పింది మరేవరో కాదు పోలీసులే.
By అంజి Published on 6 July 2023 5:25 AM GMT'గంజాయిని ఎలుకలు తినేశాయి'.. కోర్టులో పోలీసుల వింత వాదన
ఎలుకలు గంజాయి తినేశాయంట.. కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 22 కిలోల గంజాయిని ఎలుకలు స్వాహా చేశాయట. ఈ విషయాన్ని చెప్పింది మరేవరో కాదు పోలీసులే. ఓ గంజాయి స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు కోర్టుకు ఈ వింత సమాధానం తెలిపారు. దీంతో ఈ కేసులో ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు నిందితులు గంజాయి స్మగ్లింగ్ కేసు నుండి ఈజీగా బయటపడ్డారు. ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ పరిసరాల్లో రెండు సంవత్సరాల కిందట ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి విక్రయిస్తున్న రాజగోపాల్, నాగేశ్వరరావులను పోలీసులు 2020లో అరెస్ట్ చేశారు.
నిందితులపై విచారణ ప్రారంభించిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుండి చెన్నై హైకోర్టు పరిధిలోని మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఛార్జిషీట్‌లో ఆ ఇద్దరు వ్యక్తుల నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 50 గ్రాముల గంజాయిని టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. మంగళవారం నాడు ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు ఈ కేసు సంబంధించి సాక్షాధారాలను చూపించాల్సి వచ్చింది. దీంతో వారు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిలో 50 గ్రాముల గంజాయిని మాత్రమే చూపించారు. అయితే కోర్టు.. మిగతాది ఎక్కడా అని ప్రశ్నించింది. దానికి పోలీసులు ఎలుకలు తినేశాయి అంటూ వింత సమాధానం ఇచ్చారు. చార్జిషీట్‌లో పేర్కొన్న గంజాయి మొత్తాన్ని పోలీసులు సమర్పించలేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో నిందితులు రాజగోపాల్, నాగేశ్వరరావులు.. కాస్తా నిర్దోషులుగా మారారు.