మాయావతి మేనల్లుడికి భారీ ఆఫ‌ర్‌..!

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు.

By Medi Samrat
Published on : 5 March 2025 2:41 PM IST

మాయావతి మేనల్లుడికి భారీ ఆఫ‌ర్‌..!

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. నా చివరి శ్వాస వరకు కూడా పార్టీలో నాకు వారసుడు లేడని నిర్ణయించుకున్నానన్నారు. నాకు పార్టీ, ఉద్యమం ప్ర‌థ‌మం.. అన్నదమ్ములు, సోదరీమణులు, వారి పిల్లలు తర్వాతని బీఎస్పీ అధినేత్రి అన్నారు. అందుకే ఇప్పుడు నా స్థానంలో ఎవరూ ఉండరు. నేను జీవించి ఉన్నంత కాలం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధాలా కృషి చేస్తూనే ఉంటానన్నారు.

మాయావతికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న ఆకాష్ ఆనంద్‌కు ఇది పెద్ద దెబ్బ. ఆయన రాజకీయ ప్రయాణం మధ్యలో నిలిచిపోయింది. కాగా, ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష‌మైన‌ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) చీఫ్ రాందాస్ అథవాలే ఆకాష్ ఆనంద్‌ను తమ పార్టీలో చేరమని ఆఫర్ చేశారు. బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాలని, ఆయన (ఆకాశ్ ఆనంద్) పార్టీలో చేరితే యూపీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరింత బలపడుతుందని రాందాస్ అథవాలే అన్నారు.

ఆకాష్ ఆనంద్ తన బావ అశోక్ సిద్ధార్థ్, అతని భార్యచే ప్రభావితమయ్యారని మాయావతి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌తో సహా మొత్తం దేశంలో పార్టీని రెండు గ్రూపులుగా విభజించి అశోక్ సిద్ధార్థ్ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని, అందుకే ఆయనను తొలగించామ‌ని మాయావతి పేర్కొన్నారు. అశోక్ సిద్ధార్థ్ కుమార్తెను ఆకాష్ వివాహం చేసుకున్నాడు. ఆకాష్‌పై తన భార్య ప్రభావంతో ఉంద‌ని.. ఇది పార్టీకి అనుకూలం కాదని.. అటువంటి పరిస్థితితుల‌లో కాన్షీరామ్ జీ చూపిన మార్గంలో.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలోని అన్ని బాధ్యతల నుండి త‌ప్పించ‌డం జ‌రిగింద‌ని మాయావతి పేర్కొన్నారు.

Next Story