2024 జనవరి 1న అయోధ్య రామ మందిరం ఓపెనింగ్
Ram Temple In Ayodhya Will Be Inaugurated On January 1 2024 Amit Shah. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామజన్మ భూమి దగ్గర రామ మందిరం నిర్మిస్తున్నారు.
By అంజి Published on 5 Jan 2023 3:30 PM GMTఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామజన్మ భూమి దగ్గర రామ మందిరం నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని జనవరి 1, 2024న ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలిపారు. త్రిపురలో బీజేపీ జన్ విశ్వాస్ యాత్ర ప్రారంభించిన తర్వాత అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. ''రాహుల్ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలను ప్రకటిస్తున్నాను'' అంటూ వ్యాఖ్యానించారు. జనవరి 1, 2024 నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందన్నారు.
బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం దగ్గర రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ లల్లా దర్శనం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పరిసర ప్రాంతంలో జరుగుతోంది. ఆలయానికి చెందిన 45 శాతం నిర్మాణ పనులు పూర్తి అయినట్లు సమాచారం. రామ్ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. రామ మందిర దగ్గర 550 మంది ఎల్ అండ్ టీ కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి ఆలయ కాంప్లెక్స్‌ను మాత్రం 2025లోగా పూర్తి చేయనున్నారు. రామ మందిరం ఆలయ నిర్మాణానికి విరాళాల రూపంలో రూ.3200 కోట్లు అందాయి.
ప్రధాని మోదీ ఆగస్టు 5, 2020న ఆలయ నిర్మాణం కోసం 'భూమి పూజ' చేశారు. ప్రణాళిక ప్రకారం.. రామ మందిరం పరిసరాల్లోని 70 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి, కేవట్, శబరి, జటాయువు, సీత, విఘ్నేశ్వరుడు (గణేష్), శేషావతార్ (లక్ష్మణుడు) ఆలయాలను కూడా నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణం, దాని ప్రాంగణంతో సహా మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని కలుపుతూ దీర్ఘచతురస్రాకారంలో, రెండు అంతస్తుల 'పరిక్రమ' రహదారిని కూడా నిర్మిస్తున్నారు. దాని తూర్పు భాగంలో ఇసుకరాయితో చేసిన ప్రవేశ ద్వారం ఉంటుంది. రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుండి తెల్లటి పాలరాయిని ఆలయ గర్భగుడి లోపల ఉపయోగిస్తున్నారు.