దేశ వ్యాప్తంగా రైతుల నిరసనలు ఉధృతం అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా రైతులు నిరసనలపై చర్చించాలని పార్లమెంట్ నిర్ణయించింది. రైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని విపక్ష పార్టీలు చేసిన డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని రాజ్యసభ నిర్ణయించింది. ఈ చర్చ రాజ్యసభలో జరుగుతుందని విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక చర్చ అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు అంటున్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే రైతుల సమస్యలు, సాగు చట్టాలపై చర్చ మొదలవుతుందని, ఇది రెండు రోజుల పాటు సాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ ఉదయం సభలో ప్రకటించారు. ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు రైతు సమస్యలపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఈ విషయమై నినాదాలు చేస్తూనే ఉండటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన చైర్మన్, ఆపై సభను వాయిదా వేశారు. ఆ వెంటనే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఓ ప్రకటన విడుదల చేస్తూ, సభ్యుల విపక్ష డిమాండ్ ను అంగీకరిస్తూ, 15 గంటల పాటు రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు.