బీఆర్‌ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం ప్రారంభం
Rajshyamala yagam started at BRS office in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
By అంజి Published on 13 Dec 2022 12:39 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్‌ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారు. ఈ యాగం కోసం ఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఇతర అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యాగంలో పాల్గొనేందుకు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టారు.
యాగ నిర్వహణ కోసం రుత్విక్కులు సోమవారమే ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం హోమంలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. స్వర్ణ భారతం అనే సంకల్పం పేరుతో హోమం నిర్వహిస్తున్నారు.
''రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు''. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
రేపు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రేపు ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభకానుంది. రేపు మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కార్యాలయం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ కార్యాలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టీ కార్యాలయ ప్రారంభానికి రేపు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. పంజాబ్, యూపీ, హర్యానా, ఒడిశా, తమిళనాడుకు చెందిన రైతు నాయకులు కూడా పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.