పదవీ విరమణ చేయనున్న సీఈసీ.. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఢిల్లీ ఎలక్షన్ వరకూ ఎన్నో సవాళ్లు..
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.
By Medi Samrat Published on 15 Feb 2025 9:30 AM IST
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక త్వరలో ప్రారంభం కానుంది. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను నియమించనున్నట్లు సమాచారం. కొత్త CEC 2026లో బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలో ఎన్నికలను నిర్వహిస్తారు. మీడియా కథనాల ప్రకారం.. కమిటీ సమావేశం సోమవారం జరిగే అవకాశం ఉంది.
కమిటీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం రిలీవ్ కానున్నారు. రాజీవ్ కుమార్ మే 2022లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ నాయకత్వంలో అనేక ఉన్నత స్థాయి ఎన్నికలను నిర్వహించారు. వీటిలో గతేడాది ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
రాజీవ్ కుమార్ 2022లో రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించారు. 2023లో కాంగ్రెస్ గెలిచిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికలను, బీజేపీ విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలను పర్యవేక్షించారు. గత వారం ఢిల్లీ ఎన్నికలతో ఎన్నికల సంఘం చీఫ్‌గా ఆయన పదవీకాలం ముగిసింది.
ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ రాజీవ్ కుమార్.. పదవీ విరమణ తర్వాత హిమాలయాల్లో చాలా నెలలు గడపడం ద్వారా తనను తాను "డిటాక్సిఫై" చేసుకోవాలని యోచిస్తున్నానని చమత్కరించారు. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. “రాబోయే నాలుగు-ఐదు నెలల పాటు నాకు నేను డిటాక్సిఫై చేసుకుంటాను. హిమాలయాలకు వెళ్తాను.. మీడియా దృష్టికి దూరంగా ఉంటాను.. నాకు ఏకాంతం కావాలి” అని అన్నారు. 1984 బ్యాచ్‌కి చెందిన బీహార్/జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్. ఆయన రిటైర్మెంట్ తర్వాత చదువుకు దూరమైన పిల్లలను చదివించేందుకు ఏదైనా చేయాలనే కోరికను వ్యక్తం చేశారు.