సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. రజనీకాంత్ భార్య లతకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తన అధికారిక X పేజీలో ఈ విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రధాని తెలుసుకున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో రజనీని డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉందని వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, కమల్ హాసన్ కూడా రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తెలిపారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన కోలుకోవాలంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టారు.
రజనీకాంత్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సూపర్‌స్టార్‌కు గుండెకు సంబంధించిన చికిత్స విజయవంతంగా జరిగిందని ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం నాటికి డిశ్చార్జి అవుతారని కూడా తెలిపింది. రజనీకాంత్ 30 సెప్టెంబర్ 2024న గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆయన బాగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని ఆసుపత్రి వైద్యులు ప్రకటనలో తెలిపారు.