ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్ భరత్‌మాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 11:15 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్ భరత్‌మాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైత్‌పూర్ టోల్ వద్ద గురువారం రాత్రి ఈ రోడ్డుప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. అకస్మాత్తుగా ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌గఢ్ నుంచి బికనీర్ వైపు వెళ్తున్న కారు.. ఆగివున్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలను చేపట్టారు. కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అయితే.. అతివేగంగా వచ్చి ఢీకొనడం వల్ల కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఒక్క బాలిక తప్ప మిగతా ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. కాగా.. కారు నెంబర్ ఆధారంగా హర్యానాకు చెందినవారుగా తెలిపింది.
తీవ్రగాయాలపాలైన బాలికను హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ.. దురదృష్టవశాత్తు ఆ పాప కూడా చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచింది. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. దబ్వాలి తహసీల్ నివాసుతులని పోలీసులు చెబుతున్నారు. కారు అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని.. ముందు ఆగివున్న ట్రక్కును గమనించలేదని అందుకే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.