గౌర‌వం లేని మంత్రి ప‌దవి నా కొద్దు సీఎం గారు.. న‌న్ను తొల‌గించండి

Rajasthan minister asks CM to relieve him from ‘dishonourable’ post.త‌న‌కు మంత్రి ప‌ద‌వి నుంచి విముక్తి క‌ల్పించాల‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2022 11:57 AM IST
గౌర‌వం లేని మంత్రి ప‌దవి నా కొద్దు సీఎం గారు.. న‌న్ను తొల‌గించండి

త‌న‌కు మంత్రి ప‌ద‌వి నుంచి విముక్తి క‌ల్పించాల‌ని కోరుతూ ఓ మంత్రి ఏకంగా సీఎంకు లేఖ రాశాడు. త‌న ప‌రిధిలోని శాఖ‌ల్లో ఇత‌రుల జోక్యం ఎక్కువ అవుతోంద‌ని, త‌న‌కు ప్రాధాన్య‌త లేని చోట ఉండ‌డం ఎందుకు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న వ‌ద్ద నున్న శాఖ‌ల‌ను స‌ద‌రు అధికారికే ఇచ్చేయాల‌ని కోరుతూ మంత్రి రాసిన లేఖ ప్ర‌స్తుతం రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలో బండి ఎమ్మెల్యే అశోక్‌ చంద్నా క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిలీఫ్‌ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే.. గ‌త కొంత‌కాలంగా త‌న ప‌రిధిలోని శాఖ‌ల్లో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కుల్దీప్‌ రంకా జోక్యం మితిమీరిపోయింద‌ని మండిప‌డుతూ ట్విట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు. వెంట‌నే త‌న‌ను గౌర‌వం లేని ప‌ద‌వి నుంచి తొల‌గించండి అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం చంద్నా చేసిన ట్వీట్ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే అదునుగా ప్ర‌తిప‌క్షాలు గెహ్లాట్ ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డుతున్నాయి. ఇది మునిగిపోయే పడవ, పరిస్థితులు చూస్తే 2023కు ముందే అది జరిగేట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియా విమర్శలు గుప్పించారు.

Next Story