అన్ని పండుగలపై నిషేధం
Rajasthan govt bans all religious gatherings to curb spread of Covid-19.దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభదశంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మరోసారి వినాశనం తప్పదని పేర్కొంది. కరోనా తగ్గుమఖం పడుతున్నప్పటికి భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్‌లాక్‌కు వెళ్లినా.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మతపరమైన పండుగలపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధాస్త్రం విధించింది.
త్వరలో జరగనున్న కన్వర్ యాత్ర, ఈదుల్ జుహా పండుగల సందర్భంగా ఎలాంటి బహిరంగ మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది. మధురలోని గోవర్థన ఏరియాలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ముడియా పూనో మేళాను ఈ ఏడాది రద్దు చేయగా.. చాతుర్మాస పండుగ సందర్భంగా భక్తులు గుమిగూడటానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అన్ని మతాల వారు తమ తమ మతపరమైన కార్యక్రమాలను ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం 522 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ఆరాష్ట్రంలో 9,43,788 కరోనా కేసులు నమోదు కాగా, 8,947 మంది మరణించారు. ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. 2,23,73,512 మందికి మొదటి డోసు, 51,27,110 మందికి రెండో డోసు కరోనా టీకాలు వేశారు.