అంతర్జాతీయంగా చమురు ధరలు ఎలా ఉన్నా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్‌టైమ్ రికార్డును సృష్టిస్తున్నాయి. దీంతో వాహానదారులు రోడ్ల పైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఏకంగా రూ.100 మార్క్‌ను దాటేసింది. చమురు సంస్థల రోజువారి వడ్డింపుల కారణంగా దేశవ్యాప్తంగా ప్రతీరోజు పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో గురువారం నాటి పెట్రోల్ ధర నూటొక్క రూపాయలు దాటిన నేపథ్యంలో ఆరాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. పెట్రోల్ భారాన్ని కాస్త తగ్గించడానికి పూనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
సీఎం గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 2 శాతం వ్యాట్‌ను తగ్గించింది. తాజా నిర్ణయంతో ఇకపై పెట్రోల్‌పై 36 శాతం, డీజిల్‌పై 26 శాతం వ్యాట్ వసూలు చేయనున్నారు. ఈ ఉత్తర్వులు గురువారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. శుక్రవారం జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ఒక్కింటికి 92.51, డీజిల్ 84.62 రూపాయలకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ ధరల ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లల్లో కదలికలు నమోదవుతుంటాయి. రాష్ట్రాలు విధించే అమ్మకపు పన్ను దీనికి అదనం. పెట్రో ఉత్పత్తుల ధరలను పర్యవేక్షించే బాధ్యత చమురు కంపెనీలదే.