రాష్ట్ర‌ప‌తి ఆశీర్వాదం కోసం య‌త్నం.. స‌స్పెండ్ అయిన మ‌హిళా ఇంజినీర్‌

Rajasthan engineer suspended for trying to touch President Murmu's feet.రాష్ట్ర‌పతి సెక్యూరిటీ ప్రొటోకాల్ ను ఓ మ‌హిళా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jan 2023 10:56 AM IST
రాష్ట్ర‌ప‌తి ఆశీర్వాదం కోసం య‌త్నం.. స‌స్పెండ్ అయిన మ‌హిళా ఇంజినీర్‌

రాష్ట్ర‌పతి సెక్యూరిటీ ప్రొటోకాల్ ను ఓ మ‌హిళా ఇంజినీర్ అతిక్ర‌మించింది. ఈ ఘ‌ట‌న‌ను కేంద్ర హోంశాఖ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోర‌గా.. ప్ర‌భుత్వం ఆ మ‌హిళా ఇంజినీర్‌ను స‌స్పెండ్ చేసింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ నెల 3, 4 తేదీల్లో రాజ‌స్థాన్ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌వ‌రి 4న రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ జంబోరీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌త్యేక ఆర్మీ విమానంలో అక్క‌డ‌కు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్ర‌కారం అధికారులు అంద‌రూ రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికేందుకు అక్క‌డ‌కు చేరుకున్నారు.

రాష్ట్ర‌ప‌తి ముర్ము అక్క‌డి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డే ఉన్న ప‌బ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్.. రాష్ట్ర‌ప‌తి ముర్ము పాదాల‌ను తాకేందుకు ప్ర‌య‌త్నించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రాష్ట్ర‌ప‌తి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆ మ‌హిళ‌ను అడ్డుకున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి నివేదిక‌ను కోరింది. దీనిపై చ‌ర్య‌లు చేప‌ట్టిన రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఆ ఇంజినీర్‌ను స‌స్పెండ్ చేసింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story