అమానవీయ ఘటన.. కుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన డాక్టర్‌

Rajasthan Doctor Chains Dog To Car Drags Around City. ఓ డాక్టర్‌ తన ఇంటి వద్ద ఉండే వీధి కుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. మానవత్వంతో దానికి ఆహారం పెట్టాల్సిందిపోయి

By అంజి  Published on  19 Sep 2022 2:39 AM GMT
అమానవీయ ఘటన.. కుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన డాక్టర్‌

ఓ డాక్టర్‌ తన ఇంటి వద్ద ఉండే వీధి కుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. మానవత్వంతో దానికి ఆహారం పెట్టాల్సిందిపోయి.. దాని పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కాస్తైనా కనికరం లేకుండా వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస అనుభవించింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వైద్యుడు కారును నడుపుతున్నప్పుడు, గొలుసుతో కట్టుకున్న కుక్క వాహనం వేగాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది.

జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ రజనీశ్‌ గల్వా ఇంటివద్ద ఓ వీధి కుక్క ఉంది. దానిని ఊరిబయట వదిలిపెట్టాలనుకున్న డాక్టర్‌.. ఆ కుక్క మూతిని ఓ తాడుతో కట్టి.. తన కారుతో ఊరంతా తిప్పాడు. ఈ క్రమంలో కారుతోపాటు పరిగెత్తలేకపోతున్న ఆ కుక్కను గమనించిన ఓ బైకర్‌.. వెంటనే ఆ కారును ఆపాడు. కుక్క మూతికి ఉన్న తాడు విడిపించాడు. ఈ ఘటనపై నగరంలోని డాగ్ హోమ్ ఫౌండేషన్‌కు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన కుక్క కోసం స్థానికులు అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అదే సమయంలో నిందితుడు డాక్టర్ రజనీష్ గాల్వా వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన ఇంటి సమీపంలో వీధి కుక్క నివసిస్తోందని, దానిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై డాగ్‌ హోమ్‌ ఫౌండేషన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ డాక్టర్‌పై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారని ఎస్‌హెచ్‌వో జోగేంద్ర సింగ్‌ తెలిపారు.]


Next Story